సిద్దిపేట ప్రతినిధి,అర్జున్ సమాచారం:
ముదిరాజులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి ముదిరాజ్ హక్కుల సాధన సమితి
ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏ,లోకి మారుస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఆ హామీని నేటికీ అమలు చేయలేదని ముదిరాజ్ హక్కుల సాధన సమితి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాలయాపన చేయకుండా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమం కోసం చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేశారని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేపపిల్లల పంపిణీ విషయంలో 10 శాతం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా టెండర్ల ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. దీనివల్ల మత్స్యకారుల కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు.
అదేవిధంగా గత ప్రభుత్వంలో మత్స్యకారులకు టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలు, చేపలు పట్టే పరికరాలు మరియు ఇతర సామాగ్రి అందించే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులు, ముదిరాజుల కోసం చెప్పుకోదగిన కొత్త సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని విమర్శించారు.
ముదిరాజులకు బీసీ ఏ, రిజర్వేషన్ కల్పించడంతో పాటు మత్స్యకారుల సంక్షేమానికి సంబంధించిన పథకాలను పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న హామీలను కార్యాచరణ ప్రణాళికతో అమలు చేయాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ అంశాలపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ ముదిరాజ్ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ముదిరాజుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని హరీష్ రావును కోరారు.
ముదిరాజుల హక్కులు, మత్స్యకారుల సంక్షేమం కోసం తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ముదిరాజ్ హక్కుల సాధన సమితి నాయకులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి హామీల అమలుకు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర యూత్ అధ్యక్షులు పడిగె ప్రశాంత్ ముదిరాజ్, నంగునూరు మండల అధ్యక్షులు గూళ్ళ మధు మరియు రాగుల సతీష్ , పిట్ల భాస్కర్, పిట్ల సంజీవ్, కుమార్, చందు, బాలరాజు, రఘు, శ్రీనివాస్, వంశీ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
=============================